ప్రవేశిక

తెలుగు భాష భారతదేశంలోని ప్రధాన భాషలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 మిలియన్ల మంది మాట్లాడే ఈ భాషకు 3,000 సంవత్సరాలకు పైగా ఉన్న విశిష్టమైన చరిత్ర ఉంది. ఐతరేయ బ్రాహ్మణం లో ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణం, మహాభారతం, పురాణాలు వంటి గ్రంథాలలో ఆంధ్రదేశం గురించి వివరాలు ఉన్నాయి. నాట్యశాస్త్రం తెలుగు భాషను ప్రస్తావించగా, గాథాసప్తశతిలో కూడా తెలుగు పదాలు కనబడతాయి. ప్రాచీన కాలం నుంచే ప్రాకృత మరియు సంస్కృత శాసనాలలో తెలుగు పదాలు కనిపించడం, ఈ భాష యొక్క ప్రాచీనతకు స్పష్టమైన ఆధారాలు.
తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైవిధ్యం విశేషమైనది. నన్నయ నుండి చిన్నయసూరి వరకు అనేక మహాకవులు, తత్త్వగ్రంథ రచయితలు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు, శతకాలు, యక్షగానాలు రచించిన పండితులు, జానపద కళాకారులు, శిల్పకళాకారులు తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంపదను ఎంతో మహోన్నతం చేశారు. ఈ అపారమైన వారసత్వం మనకు గర్వకారణమే కాకుండా, దాన్ని రక్షించడానికి, భవిష్యత్ తరాలకు పరిచయం చేయడానికి, వారిలో ఆసక్తిని రేకెత్తించడానికి పూనుకోడం కూడా మన బాధ్యత.
తెలుగునుడి గురించి
తెలుగునుడి అనేది తెలుగు సాహిత్యంపై లోతైన అవగాహన కలిగిన సాహిత్యాభిమానులు మరియు పండితులు ప్రారంభించిన మార్గదర్శక కార్యక్రమం. ఈ కేంద్రం ద్వారా మా లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి:
- శాస్త్రీయ సాహిత్యం వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న తెలుగు సాహిత్య సంప్రదాయంలో ఓ ముఖ్యమైన భాగం. తెలుగులో రచించబడిన అనేక విలువైన మహాకావ్యాలు, తత్త్వగ్రంథాలు, గద్య, పద్య రచనలు వెలుగులోకి రావాలి. ఈ లక్ష్యంతో మేము ప్రాచీన గ్రంథాలను ఆంగ్లంలో అనువదించడం, ముఖ్యమైన గ్రంథాలపై వ్యాఖ్యానాలు రచించడం, రచయితల వివరాలతో కూడిన డేటాబేస్ సృష్టించడం, ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించాము.
- తెలుగు సాహిత్య పాండిత్యం అష్టావధానం, శతావధానం, మహాకావ్యాల రచన, శాస్త్రీయ వ్యాఖ్యానాల రచన వంటి వైఖరుల్లో కొనసాగుతోంది. శాస్త్రీయ అధ్యయనాలకు అంకితమైన ప్రముఖ పండితులు, పరిశోధకుల మద్దతుతో మేము పనిచేస్తున్నాము. మేము సీరియస్‌గా పరిశోధన చేస్తున్నవారికి తోడ్పడి ఆదరించడం, అవసరమైన వనరులను అందించడం, ఫెలోషిప్‌లు, పరిశోధన గ్రాంట్లు అందించడం మా ముఖ్య లక్ష్యాలలో ఒకటి.
మా బృందం
ఈ కేంద్రాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో ప్రముఖ తెలుగు సాహిత్య పండితుడు మరియు పదవీవిరమణ పొందిన తెలుగు ప్రొఫెసర్ ఆర్. వి. ఎస్. సుందరం, క్లాసికల్ తెలుగు అధ్యయనాల కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు పదవీవిరమణ పొందిన తెలుగు ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్, భారతీయ శాస్త్రీయ సంప్రదాయాల ప్రచారకుడు మనీశ్ మహేశ్వరి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి నిపుణుల సహకారం, అంకితభావంతో పనిచేసే బృందం కావాలనేది మా ఆశయం.
ఈ కేంద్రం తత్వ హెరిటేజ్ ఫౌండేషన్ మద్దతు మరియు నిధుల తోడ్పాటుతో ముందుకు సాగుతోంది.
కార్యనిర్వాహక మండలి

ఆర్వీయస్. సుందరం

ఎం. సంపత్కుమార్

మనీశ్ మహేశ్వరి


